ఔషధాలు మరియు జీవనశైలిపై సాధారణ అపోహలు — ప్రతి రోగి తెలుసుకోవలసిన విషయాలు

ఆరోగ్యానికి సంబంధించిన అపోహలు, ఇంటింటి చిట్కాలు, మరియు అసత్య సలహాల వలన రోగులు సరిగ్గా మందులు వాడకపోవడం జరుగుతోంది. దీని వలన చికిత్స ఫలితాలు తారుమారవుతాయి. ఇక్కడ కొన్ని సాధారణ అపోహలు మరియు వాటి వెనుక వాస్తవాలను తెలుసుకుందాం.

Medicine Myths

1. రక్తపరీక్షకు ముందు మందులు తీసుకోవడం మానేయడం

కొంత మంది రోగులు రక్తపరీక్షకు ముందు మందులు లేదా ఇన్సులిన్ తీసుకోకుండా “మందులు పనిచేస్తున్నాయా లేదా?” అని తెలుసుకోవాలనుకొని మందులు మానేస్తారు.

  • నిజం: ఇది చాలా ప్రమాదకరం. ఉదాహరణకు, థైరాయిడ్ పరీక్షకు ముందు థైరానార్మ్ మానేయడం లేదా షుగర్ పరీక్షలకు ముందు డయాబెటిస్ మందులు మానేయడం వలన తప్పుడు ఫలితాలు వస్తాయి.
  • వైద్యులు మీ రిపోర్ట్స్ ఆధారంగా మందుల డోస్‌ను సవరిస్తారు. కాబట్టి మందులు మానేయడం వలన వైద్యులు తప్పు డోస్ మందులు ఇస్తారు. ఇది ప్రమాదకరం.

2. మందులు కొద్దిరోజులు మాత్రమే వాడటం

కొన్ని మందులు (అంటే యాంటిబయోటిక్స్) డాక్టర్ చెప్పిన విధంగానే పూర్తిగా వాడాలి. మధ్యలో మానేస్తే ఇన్ఫెక్షన్ తగ్గదు మరియు యాంటిబయోటిక్ రెసిస్టెన్స్ వస్తుంది.
థైరాక్సిన్, బీపీ మందులు, డయాబెటిస్ మందులు — ఇవి దీర్ఘకాలం అవసరం కావచ్చు. ఎప్పటికప్పుడు వైద్యుడితో చర్చించి **డాక్టర్ సలహా మేరకే మందులు వాడాలి **. సొంతంగా మందులు ఆపకూడదు / మొదలు పెట్టదు.

3. వ్యాయామం యొక్క ప్రాధాన్యత

డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి జీవనశైలి వ్యాధుల చికిత్సలో వ్యాయామం చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది.

  • రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, యోగా, లేదా సైక్లింగ్ చేయడం వలన షుగర్, బీపీ నియంత్రణలో ఉంటాయి.
  • సైక్లింగ్ మందుల మోతాదును తగ్గించటంలో సహాయపడుతుంది.
    వ్యాయామం అనేది చాలా ముఖ్యం.

4. మందులు అలవాటు అవుతాయన్న భయం

చాలా మంది రోగులు రోజూ మందులు తీసుకుంటే అలవాటు పడతామేమో అని భయపడతారు.

  • నిజానికి, చాలా మందులు శరీరంలో 24 గంటల కన్నా తక్కువ సమయం మాత్రమే ఉంటాయి. అందుకే వాటిని ప్రతిరోజూ తీసుకోవాలి.
  • మీరు జీవనశైలిని మార్చిన తరువాత బరువు తగ్గడం, వ్యాయామం మొదలు పెట్టడం చేసినప్పుడు మందులు డోస్ తగ్గించవచ్చు లేదా ఆపవచ్చు — కానీ **డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే చెయ్యాలి **.

5. ఇన్సులిన్ పట్ల భయం

ఇన్సులిన్ అంటే చివరి దశ మందు అని భయపడే భావన జనాలలో ఉంది.

  • నిజం: ఇది ఒక రీప్లేస్‌మెంట్ థెరపీ మాత్రమే — థైరాయిడ్‌కు థైరాక్సిన్ ఇచ్చినట్లే.
  • షుగర్ వ్యాధి ఒక స్టేజీలో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం పూర్తిగా ఆపేస్తుంది. అప్పుడు టాబ్లెట్స్ డోస్ పెంచడం వల్లన ప్రయోజనం ఉండదు.
  • భవిష్యత్తులో ఇన్సులిన్ టాబ్లెట్ వస్తే , అది ఇంజెక్షన్లకు ప్రత్యామ్నాయం అవుతుంది. కానీ అప్పటివరకు ఇన్సులిన్ అవసరమైతే ఆలస్యం చేయకండి.

6. జాండిస్‌లో చెట్ల మందుల వాడకంపై అపోహ

బహుశా మీకు “ఆయుర్వేదం అంటే సురక్షితం” అనే భావన ఉండవచ్చు.

  • నిజం: జాండిస్ ( పచ్చ కామెర్లు ) వచ్చినప్పుడు లివర్ అప్పటికే బలహీనంగా ఉంటుంది. చెట్ల మందులు, ఆయుర్వేద మందులు లేదా ఇతర టాక్సిన్లు లివర్ ద్వారా ప్రాసెస్ అవుతాయి, అందువల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది.
  • కొన్ని మొక్కలు నేరుగా లివర్‌ను హాని కలిగిస్తాయి.
  • గుర్తుంచుకోండి: పచ్చగా కనిపించేది అంతా ఆరోగ్యకరం కాదు. ప్రకృతిలో విషపూరిత మొక్కలు కూడా ఉంటాయి — అవి మానవులను చంపగలవు కూడా.
    కాబట్టి జాండిస్ (పసకలు / కామెర్లు) సమయంలో వైద్యుడి సలహా మేరకే మందులు వాడాలి.

చేయవలసినవి ✅

  • వైద్యుడి సూచనల మేరకు మందులు తీసుకోండి.
  • మందులు మానేసే ముందు డాక్టర్‌ను సంప్రదించండి.
  • ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి.
  • జీవనశైలి మెరుగయ్యాక మందులు తగ్గించుకోవచ్చా అని వైద్యుడిని అడగండి.
  • అపోహల కంటే, శాస్త్రీయ ఆధారాలపై విశ్వాసం ఉంచండి.

చేయకూడదినవి ❌

  • పరీక్షల ముందు మందులు మానేయవద్దు — ఇది ఫలితాలను తారుమారుచేస్తుంది.
  • యాంటిబయోటిక్స్ మధ్యలో మానేయవద్దు — రెసిస్టెన్స్ వస్తుంది.
  • ఇన్సులిన్‌ను భయపడవద్దు — అవసరమైనప్పుడు ఇది ప్రాణాలను కాపాడుతుంది.
  • “నేచురల్” ఉత్పత్తులన్నీ సురక్షితమన్న నమ్మకాన్ని పెట్టుకోకండి.
  • జాండిస్ సమయంలో హెర్బల్ మందులను ఉపయోగించవద్దు.

ముగింపు

జీవనశైలిలో మార్పులు మరియు సమయానికి మందులు — రెండూ ముఖ్యం. మందులను తప్పుడు పద్ధతిలో వాడటం లేదా అపోహలతో వాడకపోవడం ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది. కాబట్టి వ్యాయామం, సరైన ఆహారం, మరియు వైద్యుడి పర్యవేక్షణ — ఇవే ఆరోగ్య రహస్యాలు.

రచయిత గురించి

డా. రాజా రమేష్, MD ( osmania )
అత్తాపూర్, హైదరాబాద్‌లో కన్సల్టెంట్ ఫిజిషియన్ & డయాబెటాలజిస్ట్
జర్మన్‌టెన్ హాస్పిటల్ (10am–5pm) & కేర్ క్లినిక్ అత్తాపూర్ (5pm–8pm) లో అందుబాటులో ఉంటారు.
📞 అపాయింట్‌మెంట్‌ కోసం కాల్ చేయండి: +91 7989676770

Share Appointment